: పదేపదే చిరుగుతున్న భారీ జాతీయ జెండా... కష్టసాధ్యంగా మారిన నిర్వహణ!
దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ లోని సంజీవయ్య పార్కులో సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 291 అడుగుల ఎత్తులో రెపరెపలాడుతున్న ఈ భారీ జాతీయ జెండా నిర్వహణ కష్టతరంగా మారింది. ఎందుకంటే, సంజీవయ్య పార్క్ హుస్సేన్ సాగర్ పక్కనే ఉండటంతో వేగంగా వీస్తున్న గాలులకు తరచుగా జెండా చిరిగిపోతోంది. ఇప్పటికే నాలుగుసార్లు జెండాను మార్చాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు రోజులకే మొదటిసారిగా జెండా చిరిగిపోయింది. ఆ తర్వాత మరో జెండాను ఏర్పాటు చేశారు. అది కూడా మూడు రోజులకే చిరిగిపోయింది. మళ్లీ మరో జెండాను ఏర్పాటు చేయడం, 12వ రోజునే అది కూడా చిరిగిపోవడంతో సంబంధిత అధికారులు తలలు పట్టుకున్నారు. ఉన్న జెండాలన్నీ అయిపోవడంతో చేసేదేమిలేక రెండురోజుల పాటు పోల్ ను ఖాళీగా ఉంచాల్సి వచ్చింది. రెండో జెండా చిరిగినప్పుడు ముంబైలోని సారాబాయి ఫ్లాగ్ కంపెనీకి మూడు జెండాలను తెలంగాణ సర్కార్ ఆర్డర్ ఇచ్చి తెప్పించింది. కాగా, మొదటి మూడు జెండాలను ఖమ్మంలో తయారు చేయించారు. ఒక్కొక్క జెండా ఖరీదు లక్షన్నర రూపాయలున్నట్లు సమాచారం. వేగంగా వీస్తున్న గాలులకు జెండాలు పదేపదే చినిగిపోతున్న విషయాన్ని వివరిస్తూ, ఢిల్లీలోని ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కేవి గిల్ ను తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు ఫోన్ లో సంప్రదించింది. నియమ నిబంధనలు తెలుసుకుంది. గాలులకు జెండాలు చిరగడం మాన్యమెంట్ ఫ్లాగ్ కేటగిరి కిందకు వస్తుందని, జెండా తొలగించినా కొన్నిరోజులు ఇబ్బంది ఉండదనే విషయం నియమ నిబంధనల్లో ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెండురోజుల పాటు ఖాళీగా ఉంచిన పోల్ పై ఆ తర్వాత మరో జెండాను ఎగురవేశారు. ప్రస్తుతం పోల్ పై రెపరెపలాడుతున్న జెండా నాలుగోది. కాగా, జెండాలు పదేపదే చిరిగిపోతుండటంతో ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని, భారీ జెండా నిర్వహణ కష్టసాధ్యమవుతుందేమోనని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.