: నేను 11.5 కోట్లు ఖర్చు పెట్టాననలేదు... ప్రజలు, కార్యకర్తలు అన్న మాటలే అన్నాను: స్పీకర్ కోడెల వివరణ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గుంటూరులో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో 11.5 కోట్లు ఖర్చు చేశానని తాను అనలేదని స్పష్టం చేశారు. తాను అత్యంత విలువలు కలిగిన వ్యక్తినని ఆయనకు ఆయనే కితాబునిచ్చుకున్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో 8 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని, ఎప్పుడూ నిబంధనలు ఉల్లంఘించలేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఎన్నికల్లో పాల్గొన్న ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ కు జమా ఖర్చుల వివరాలన్నీ సమర్పిస్తానని అన్నారు. ఇంత వరకు తను సంపాదించిన మొత్తం తన కష్టార్జితం అని ఆయన చెప్పారు. గ్రామాల్లో ఎన్నికల ఖర్చుపై కార్యకర్తలు, ప్రజలు నాతొ చెప్పిన మాటలే చెప్పానని అన్నారు. తనకు తెలియకుండా గ్రామాల్లో వారు ఖర్చు చేస్తే చేసి ఉండొచ్చని అది తనకు తెలియదని ఆయన చెప్పారు. ఎన్నికల వ్యయం పెరిగిపోతోందని అనడం వాస్తవమని ఆయన చెప్పారు. రాజకీయాల్లో డబ్బు ప్రాబల్యం పెరగడం ప్రమాదకర సంకేతమని ఆయన తెలిపారు.