: ఆ చిన్నారికి మోదీ లేఖ రాశారు!


పూణె లోని రాయ్ గడ్ కాలనీలో ఒక చిన్న గదిలో తన తండ్రి, అంకుల్, గ్రాండ్ మదర్ తో కలిసి నివసిస్తున్న చిన్నారి వైశాలి యాదవ్ తనను చూసేందుకు వచ్చిన వారిని చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఆ చిన్నారి గురించి, ఆమె చిరునవ్వు గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే...ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) సహాయంతో ఆ చిన్నారికి గత వారం హార్ట్ సర్జరీ జరిగింది. ఆ సర్జరీ సక్సెస్ అవడంతో చిన్నారి కుటుంబం ఆనందంగా ఉంది. అయితే, తనకు సర్జరీ చేయించమని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి వైశాలి తన మొదటి లేఖలో కోరింది. సర్జరీ విజయవంతమైన తర్వాత కృతజ్ఞతలు తెలుపుతూ మోదీకి మరో లేఖ రాసింది. ఇదంతా బాగానే ఉంది. ఆ తర్వాత జరిగిన మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే... వైశాలికి ప్రధాని మోదీ లేఖ రాయడం! దీంతో, వైశాలి, ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మోదీ కార్యాలయం నుంచి వచ్చిన ఆ లేఖలో ఆయన సంతకం కూడా ఉండటంతో వారు మరింత ఆనందం పొందారు. మోదీ రాసిన ఈ లేఖను నిన్న సాయంత్రం వైశాలి అంకుల్ ప్రతాప్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘చిన్న ఇంట్లో నివసిస్తున్న తమ వంటి వారికి ఒక ప్రధాని లేఖ రాస్తారని ఎవరైనా ఊహించగలరా? మా ఇంటి అడ్రసు తెలుసుకునేందుకు పోస్ట్ మ్యాన్ కూడా కష్టపడాల్సి వచ్చింది. ఎన్వలప్ పై ప్రధాన మంత్రి కార్యాలయం ముద్ర ఉండటంతో సరైన సమయానికి ఆ లేఖ మాకు చేరింది’ అని అన్నారు. మోదీ లేఖ రాస్తారనే నమ్మకం తనకు ఉందని చిన్నారి వైశాలి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. వైశాలికి ప్రాణప్రదమైన ఆమె నానమ్మ కూడా ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News