: 'బ్రెక్సిట్' ప్రభావంతో స్టాక్ మార్కెట్ కు నష్టం!
యూరో జోన్ లో బ్రిటన్ కొనసాగాలా? వద్దా? అన్న విషయమై మరో రెండు రోజుల్లో రెఫరెండం జరగనున్న సమయంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించిన వేళ, అమ్మకాలు వెల్లువెత్తడంతో, ఒడిదుడుకుల మధ్య స్టాక్ మార్కెట్ స్వల్పంగా నష్టపోయింది. 'బ్రిటన్ ఎగ్జిట్' (బ్రెక్సిట్) భయాలతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అధిక అమ్మకాలకు పాల్పడినట్టు స్టాక్ ఎక్స్ఛేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సెషన్ ఆరంభంలో లాభాల్లో ఉన్న సెన్సెక్స్, నిఫ్టీ, ఆపై నిమిషాల వ్యవధిలో నష్టాల్లోకి జారిపోయాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మాత్రం లాభాల్లో నిలిచాయి. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 54.14 పాయింట్లు పడిపోయి 0.20 శాతం నష్టంతో 26,812.78 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 18.60 పాయింట్లు పడిపోయి 0.23 శాతం నష్టంతో 8,219.90 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.12 శాతం, స్మాల్ కాప్ 0.36 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 14 కంపెనీలు లాభపడ్డాయి. హిందాల్కో, ఇన్ ఫ్రాటెల్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, అరవిందో ఫార్మా, టాటా పవర్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,804 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,315 కంపెనీలు లాభాలను, 1,288 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. సోమవారం నాడు రూ. 1,01,34,907 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,01,23,294 కోట్లకు తగ్గింది.