: పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచిన భారత్...విదేశీ మీడియా ప్రశంసలు
రక్షణ, విమానయాన రంగాల్లో నూరు శాతం ఎఫ్డీఐ, ఫార్మా రంగంలో పరిమితుల పెంపు వంటి మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలకు వరల్డ్ మీడియా మంచి ప్రచారాన్ని కల్పించింది. నరేంద్ర మోదీ తన ఆలోచనా శక్తి, తీసుకున్న నిర్ణయాలతో ప్రపంచంలోనే విదేశీ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశంగా భారతావనిని మార్చేశారని ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా భారత్ రూపాంతరం చెందే సమయం దగ్గర పడిందని అభిప్రాయపడ్డాయి. ఆర్బీఐ గవర్నర్ గా రఘురాం రాజన్ ఉండబోడన్న వార్తలతో ఏర్పడిన నష్టాన్ని మోదీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవడం ద్వారా భర్తీ చేశారని తెలిపాయి. డిఫెన్స్ రంగంలో 100 శాతం ఎఫ్డీఐతో అత్యాధునిక సాంకేతికత భారత్ కు పరిచయం కానుందని, ఇదో అతిపెద్ద సంస్కరణని 'వాషింగ్టన్ పోస్ట్' పేర్కొంది. ప్రపంచ స్థాయి నాణ్యతతో, భారత్ లో తక్కువ ఖర్చుకే ఉత్పత్తులను తయారు చేసేందుకు ముందుకు దూకవచ్చని పేర్కొంది. కన్సల్టింగ్ సంస్థ కేపీఎంజీ స్పందిస్తూ, మేకిన్ ఇండియా కీలక మలుపు తిరిగిందని, ఇక పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు త్వరితగతిన అనుమతులు లభించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెల్లడించింది. ఇక స్థానికంగా తయారయ్యే ఆహార ప్రొడక్టుల్లో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతినివ్వడం ఎన్నో వరల్డ్ రిటైల్ చైన్ రెస్టారెంట్లకు ఓ వరమని, ఇవన్నీ ఇండియాలో భారీగా విస్తరణ ప్రణాళికలు అమలు చేయవచ్చని 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది.