: ముంబయ్ ఆటోవాలా నిజాయతీ... రెండు గంటలు వెతికి ప్రయాణికుడికి సూట్ కేస్ అప్పజెప్పిన వైనం!
ముంబయ్ లో ఒక ఆటోరిక్షా వాలా తన నిజాయతీని నిరూపించుకున్నాడు. తన ఆటో ఎక్కిన ప్యాసింజర్ ఎవరో ఆటోలో సూట్ కేసును మరిచిపోయారు. అందులో బంగారు నగలు, నగదు, ఇన్సూరెన్స్ పేపర్లు ఉన్నాయి. ఈ సూట్ కేసును వారికి అప్పజెప్పేందుకని సుమారు రెండు గంటలపాటు సదరు ఆటోవాలా కష్టపడ్డాడు. ఆ వివరాల్లోకి వెళితే, గుడ్డు గుప్తా (24) ఆటోరిక్షా నడుపుకుని జీవనం సాగిస్తుంటాడు. కుర్లా రైల్వేస్టేషన్ లో శనివారం రోజున ముక్తార్ అహ్మద్ ఇద్రిసి, అతని భార్య ఈ ఆటో ఎక్కి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ వద్ద దిగారు. తమ లగేజీని మర్చిపోయి దిగిపోయారు. రాత్రి 7.30 గంటల సమయంలో సదరు ప్రయాణికులు మర్చిపోయిన లగేజీ తన ఆటోలో ఉండటాన్ని గుప్తా గమనించాడు. అయితే, ఈ లగేజీ ఎవరు మర్చిపోయారనే విషయం మాత్రం అతనికి గుర్తుకురాలేదు. ఏమైనా సరే, ఆ లగేజీ మర్చిపోయిన యజమానికి దీనిని అందించాలనుకున్న గుప్తా బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ కు చేరుకుని, అక్కడి పోలీసు అధికారులకు ఈ విషయం చెప్పాడు. పోలీసుల సాయంతో రెండు గంటల పాటు వెతికి లగేజీ మర్చిపోయిన దంపతులను కనుగొని వారి సామాన్లను వారికి అప్పగించారు. ఈ సందర్భంగా తమ లగేజీ తమకు చేరడంతో ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంట్లోకి వెళ్లిపోయిన తర్వాత తమ లగేజీ గురించి మర్చిపోయామని... రాత్రి పది గంటల సమయంలో తమ లగేజీ తీసుకుని ఆటోవాలా, పోలీసులు రావడంతో ఆశ్చర్యపోయామని అన్నారు. బంగారు ఆభరణాలు, రూ.3,000 నగదు, ఇన్సూరెన్స్ పేపర్లు తమ సూట్ కేసులో ఉన్నాయని ముక్తార్ అహ్మద్ చెప్పారు. నిజాయతీగా సూట్ కేసును తిరిగిచ్చేసిన ఆటోవాలా గుడ్డు గుప్తాకు ముక్తార్ రివార్డు ఇవ్వబోతే అతను సున్నితంగా తిరస్కరించడం విశేషం.