: 'ఉడ్తా పంజాబ్' లాంటి సినిమాల్లో నటించడానికి పెద్ద నటులు అంగీకరించరు: కరీనా కపూర్
'ఉడ్తా పంజాబ్' లాంటి సినిమాల్లో నటించేందుకు పెద్ద తారలు అంగీకరించరని ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ తెలిపింది. 'ఉడ్తా పంజాబ్' లో తక్కువ నిడివి ఉండే పాత్రలో నటించిన కరీనా, మంచి ప్రాధాన్యమున్న పాత్ర చేసింది. ఈ పాత్రకు అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, సినీ నటులు ఇమేజ్ చట్రం నుంచి బయటకు రావడం కష్టమని చెప్పింది. అందుకే ఓ స్థాయి ఇమేజ్ ఉన్న నటులు ఇలాంటి సినిమాల్లో నటించేందుకు సందేహిస్తారని తెలిపింది. ఈ కథలో విషయం ఉంది కాబట్టే తాను అంగీకరించానని ఆమె తెలిపింది. చిన్నపాత్ర అయినా సందేశం ఉంది కనుక నటించానని, ఇలాంటి పాత్రలు చేస్తే అభిమానులు కూడా సంతోషిస్తారని ఆమె తెలిపింది. కాగా, 'ఉడ్తా పంజాబ్' ఆన్ లైన్ లో లీకైనప్పటికీ అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది.