: నేనెప్పటికీ రాజకీయాల్లోకి రాను...లెక్చరర్ గా చేస్తా లేదా సమాజసేవ!: మాజీ డీఎస్పీ అనుపమా శణై


రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని, లెక్చరర్ గా పని చేస్తా లేదంటే ఏదైనా ఎన్జీవోలో చేరి సమాజ సేవ చేస్తానని లిక్కర్ మాఫియాకు వ్యతిరేకంగా గళమెత్తి పదవికి రాజీనామా చేసిన అనుపమ శణై స్పష్టం చేశారు. కర్ణాటకలోని కుడ్లిగి డీఎస్పీగా పనిచేసిన ఆమె తన పదవికి రాజీనామా చేసింది. ఆ వెంటనే 'నేను రాజీనామా చేశాను, నువ్వెప్పుడు రాజీనామా చేస్తావు?' అంటూ సవాలు విసిరిన అనుపమ శణై మంత్రి పదవి కోల్పోయిన పరమేశ్వర నాయక్ పై జాలి చూపించారు. ఆయన మరీ అంత చెడ్డ వ్యక్తి కాదని అన్నారు. ఆయనకు తన వల్లే అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఉచ్చిలలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనను బదిలీ చేయడంలో పరమేశ్వర్ నాయక్ నిమిత్త మాత్రుడని, ఇంకొందరు పెద్దల హస్తం ఉందని అన్నారు. తన బదిలీ విషయంలో పరమేశ్వర్ నాయక్ ఒత్తిడి చేసే అవకాశాలు తక్కువ అని ఆమె అభిప్రాయపడ్డారు. తన ట్రాన్స్ ఫర్ విషయంలో ఒత్తిడి చేసిన వారి పేర్లను పరమేశ్వర్ నాయక్, డీజీపీ బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వానికి చేతనైతే తనతో పోరాటం చేయాలని సూచించారు. చేతకాని వారిలా తన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేయడమేంటని ఆమె నిలదీశారు. తాను అనుభవించిన మానసిక క్షోభపై మహిళా కమిషన్ అధ్యక్షురాలు మంజుల మానసకు లేఖ రాశానని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News