: ఇంద్రాణి ముఖర్జియా డ్రైవర్ అప్రూవర్ గా మారేందుకు న్యాయస్థానం అంగీకారం
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ అప్రూవర్ గా మారేందుకు ముంబయ్ కోర్టు అంగీకరించింది. షీనా బోరా హత్య కేసు వెలుగు చూసిందే శ్యామ్ రాయ్ వల్ల, అదీ కాక షీనా బోరాను దహనం చేసిన ప్రాంతానికి పోలీసులను తీసుకెళ్లింది కూడా ఆయనే కావడంతో అప్రూవర్ గా మారేందుకు పోలీసులు అభ్యంతరం చెప్పలేదు. దీంతో కోర్టు అతనిని అప్రూవర్ గా మారేందుకు అంగీకరించింది. కాగా, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన శ్యాం రాయ్, గత మేలో అప్రూవర్ గా మారుతానంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సీబీఐ అభ్యంతరం చెప్పలేదు. కాగా, 2012 ఏప్రిల్ లో ఇంద్రాణీ ముఖర్జియా రెండవ భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి కుమార్తె షీనా బోరా గొంతు నులిమి హత్య చేశారని శ్యాం రాయ్ చెబుతున్నారు. ఆ సమయంలో తాను కారు నడుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, ఈ కేసులో ఇంద్రాణీ ముఖర్జియా, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జియా, శ్యాం రాయ్ తదితరులు రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.