: కర్ణాటక ప్రభుత్వ నిర్వాకం.. హర్యాణాకు తరలిపోనున్న 850 కోట్ల పెట్టుబడులు
కర్ణాటక ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ రాష్ట్రం నుంచి 850 కోట్ల రూపాయల పెట్టుబడులు మరో రాష్ట్రానికి తరలిపోన్నాయి. తద్వారా ఎందరో ఉపాధి కోల్పోబోతున్నారు. అదే సమయంలో హర్యాణాలోని మనేసర్ లో మరెందరికో ఉద్యోగాలు దక్కన్నాయి. ట్రయంప్ మోటార్ సైకిల్స్ సంస్థ కర్ణాటకలో తమ కొత్త యూనిట్ ను నెలకొల్పాలని భావించింది. కోలార్ లో రూ. 850 కోట్ల ఖర్చుతో 30 ఎకరాల్లో ప్లాంట్ నిర్మించి ఏడాదికి రెండున్నర లక్షల బైక్ లు ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ మెంట్ బోర్డు(కేఐఏడీబీ)కు అడ్వాన్స్ కూడా చెల్లించింది. 2012లో ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులు సంపాదించింది. అయితే కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, భూముల కేటాయింపుపై శ్రద్ధ చూపకపోవడంతోపాటు సంస్థకు సహకారం విషయంలో అంటీముట్టనట్టుగా ఉండడంతో ట్రయంప్ కర్ణాటక నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. హర్యాణాలోని మనేసర్ లో ప్లాంట్ నిర్మించాలని యోచిస్తోంది. అయితే ఈ అంశంపై స్పందించేందుకు ట్రయంఫ్ ఇండియా నిరాకరించింది.