: పైసా ఖర్చు కాని ఆరోగ్య సూత్రాలు చెప్పిన నరేంద్ర మోదీ!


ఇంటర్నేషనల్ యోగా డే ఓ సామూహిక ఉద్యమంలా మారిపోయిందని, ఇది భారత్ కు గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం చండీగఢ్ లో 30 వేల మందితో కలసి యోగా చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడిపే సాధనమే యోగా అని వెల్లడించిన ఆయన, దీనివల్ల మానసిక ఏకాగ్రత సొంతమవుతుందని తెలిపారు. ధనికులు, పేదలు అన్న తేడా లేకుండా దీన్ని సాధన చేయవచ్చని, ఫిట్ నెస్ తో పాటు శరీరానికి వెల్ నెస్ కూడా అబ్బుతుందని వివరించారు. చిన్నారుల నుంచి గర్భిణీల వరకూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీసును నిత్య జీవితంలో ఓ భాగం చేసుకోవాలని, సెల్ ఫోన్ ను మమేకం చేసుకున్నట్టుగానే యోగానూ పరిగణించాలని మోదీ కోరారు. మధుమేహ వ్యాధితో బాధపడేవారికి సత్వర ఉపశమనం లభిస్తుందని, మిగిలిన అన్ని రుగ్మతల నుంచి దూరంగా ఉండవచ్చని వివరించారు. కాగా, ఈ కార్యక్రమానికి 5 వేల మందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన నిర్వాహకులు, భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఐరాసలో 193 సభ్య దేశాలుండగా, లిబియా, యెమెన్ మినహా అన్ని దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతోందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News