: కళానికేతన్ మోసం ‘అనంత’కే మాత్రమే పరిమితం కాదు!... రాష్ట్రవ్యాప్తంగా రూ.65 కోట్ల మేర బకాయిలు!
చేనేత కార్మికులను నిండా ముంచేసిన కళానికేతన్ మోసంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన వేలాది మంది చేనేత కార్మికుల నుంచి ఆ సంస్థ రూ.9 కోట్ల మేర విలువ చేసే పట్టుచీరలను కొన్న కళానికేతన్ డబ్బు మాత్రం చెల్లించలేదు. ఈ క్రమంలో కార్మికుల ఫిర్యాదుతో కళానికేతన్ యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన అనంతపురం పోలీసులు ఇటీవలే కంపెనీ డైరెక్టర్ లక్ష్మీశారదను అరెస్ట్ చేసింది. తాజాగా ఆ సంస్థ ఎండీ లీలా కుమార్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఒక్క ధర్మవరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కళానికేతన్ పెద్ద ఎత్తున పట్టు చీరలను కొనుగోలు చేసిందట. ధర్మవరంలో మాదిరిగానే రాష్ట్రంలోని ఏ ఒక్క చేనేత కార్మికుడికి కూడా ఆ సంస్థ బకాయిలు చెల్లించలేదట. ఈ మొత్తం బకాయిలు రూ.65 కోట్లకు పైగానే ఉన్నట్లు పోలీసులు నిగ్గుతేల్చారు.