: మొక్కే కదా అని పీకేస్తే... రేషన్ కట్ చేస్తా!: పచ్చదనం కోసం చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన సర్పంచ్ ఆదేశం!


గ్రామంలో పచ్చదనం వెల్లి విరియాలని ఆ గ్రామ సర్పంచ్ తలచాడు . ఇందుకోసం గ్రామస్థులకు ఆయన వినూత్న కట్టుబాటును అమల్లోకి తెచ్చారు. వెరసి ఆ పల్లెలో ప్రస్తుతం పచ్చదనం అలరారుతోంది. ఆ గ్రామం ఎక్కడుందనుకుంటున్నారా? టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోని ఏర్పేడు మండలంలో ఉంది. ఆ గ్రామం పేరు మడిబాక. గ్రామానికి సర్పంచ్ గా వ్యవహరిస్తున్న మల్లికార్జున నాయుడికి పచ్చదనమంటే ప్రాణం. గ్రామంలోని ప్రతి ఇంటికి కానుగ, తురాయి తదితర మొక్కలను పంపిణీ చేయించారు. మొక్కల పంపిణీతోనే పని పూర్తి కాదుగా. ఆయా కుటుంబాలు ఆ మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అలా అయితేనే తాననుకున్న ఆశయం నెరవేరుతుందని మల్లికార్జున నాయుడు భావించారు. ఇందుకోసం ఆయన వినూత్న కట్టుబాటుకు తెర తీశారు. మొక్కను కాపాడే బాధ్యతను విస్మరించే కుటుంబాలకు రేషన్ కట్ చేస్తామని ఆయన కఠిన ఆదేశాలు జారీ చేశారు. ‘‘మొక్కే కదా అని పీకేస్తే... పీక కోస్తా’’ అంటూ ‘ఇంద్ర’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పే భారీ డైలాగ్ తరహాలో ‘‘మొక్కే కదా అని పీకేస్తే... రేషన్ కట్ చేస్తా’’ అని మల్లికార్జున నాయుడు సరికొత్త ఆదేశాలు జారీ చేయడంతో ఆ గ్రామంలో పచ్చదనం వెల్లివిరుస్తోంది.

  • Loading...

More Telugu News