: కళానికేతన్ ఎండీ అరెస్ట్... హైదరాబాదు నుంచి ‘అనంత’ తరలింపు
దక్షిణాదిలో ప్రముఖ వస్త్రాభరణాల రీటెయిల్ చైన్ గా వినుతికెక్కిన ‘కళానికేతన్’ మేనేజింగ్ డైరెక్టర్ లీలా కుమార్ అరెస్టయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుల వద్ద కోట్లాది రూపాయల విలువ చేసే పట్టుచీరలు కొన్న కళానికేతన్... డబ్బు చెల్లించడంలో ఆసక్తి చూపలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చేనేత కార్మికులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంస్థ డైరెక్టర్ గా ఉన్న సంస్థ ఎండీ సతీమణి లక్ష్మీ శారదను ఇటీవలే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె అనంతపురం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా నిన్న రాత్రి మరోమారు హైదరాబాదులో రంగంలోకి దిగిన అనంతపురం పోలీసులు లీలా కుమార్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను అనంతపురానికి తరలించారు. నేడు ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నట్లు సమాచారం.