: అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే వీరంగం!... పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉద్యోగులు!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలంటూ పిలుపునిచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో పెద్ద కలకలమే రేపారు. జగన్ వ్యాఖ్యలపై మూకుమ్మడిగా దాడి చేసిన టీడీపీ వర్గాలు ఆయనను దుమ్మెత్తిపోశాయి. ఈ వ్యవహారం కాస్తంత సద్దుమణిగిన నేపథ్యంలో నిన్న జగన్ పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్యే ఇదే తరహా అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన విరుచుకుపడింది టీడీపీ నేతలపై కాదు.. సర్కారీ ఉద్యోగులపై. ఎమ్మెల్యే గారి బూతు పురాణంంతో షాక్ కు గురైన అధికారులు ఆయనపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళితే... కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్. రఘురామిరెడ్డి (వైసీపీ) నిన్న ప్రభుత్వం నిర్వహించిన ఏరువాకలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో మైదుకూరులో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చిన రఘురామిరెడ్డి... అధికారులపై దురుసుగా వ్యవహరించారు. ‘‘వ్యవసాయ శాఖలో ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు అంతా మోసపూరితమే. ఏ ఒక్క అధికారి కూడా నీతి నిజాయతీ ఎరుగరు. మీ కథ తేలుస్తా. చెప్పులతో కొట్టిస్తా. ఊళ్లోకి రానివ్వకుండా చేస్తా’’ అని ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ తర్వాత తనను సాగనంపేందుకు కారు దాకా వెళ్లిన ఓ అధికారిపై ఆయన ఏకంగా బూతు పురాణం వినిపించారట. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఆవేదన చెందిన ఆ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.