: చవటలు.. సన్నాసులు.. పీనిగలు..!: ఆర్మూర్ లో కేసీఆర్ విమర్శలు
టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్.. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీమాంధ్ర నేతలపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు వ్యతిరేకులంటూ.. వారిని సన్నాసులు, చవట దద్దమ్మలు, వెర్రిపీనుగలతో పోల్చారు. అన్నింటా తెలంగాణను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఇక సీఎం విషయానికొస్తూ, అవిశ్వాస తీర్మానం రోజున ఆయన వ్యాఖ్యలు దారుణం అని కేసీఆర్ ఆరోపించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి అలా మాట్లాడరాదని హితవు పలికారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పడం సీఎం అహంకారానికి నిదర్శనమని కేసీఆర్ మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి బయ్యారం గనుల ఉక్కును విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ నుంచి ప్రభుత్వానికి రూ. 45 వేల కోట్లు ఆదాయం వస్తుందని, అదే సమయంలో సీమాంధ్ర నుంచి రూ. 15 వేల కోట్లు మాత్రమే వస్తోందని.. అయినా, తెలంగాణపై వివక్ష కొనసాగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి రైల్వే లైన్ల కేటాయింపులో కూడా చిన్నచూపే అని ఆవేదన వ్యక్తం చేశారు.