: తెలంగాణ సీఎస్ తో ముగిసిన కలెక్టర్ల సమావేశం
తెలంగాణలో సచివాలయంలో కలెక్టర్ల సమావేశం ముగిసింది. జిల్లాలు, మండలాల పునర్విభజనపై సుదీర్ఘంగా చర్చించారు. 25 లేదా 26 జిల్లాల ఏర్పాటుకు కలెక్టర్లు ప్రతిపాదించించినట్లు సమాచారం. కొత్త జిల్లాలు, మండలాల ప్రతిపాదనలు, ఉద్యోగుల అంశాలపై సీఎస్ రాజీవ్ శర్మతో కలెక్టర్లు చర్చించారు. పరిపాలనకు అవసరమైన భవనాలు, స్థలాలు గుర్తించాలని ఈ సందర్భంగా సీఎస్ ఆదేశించారు. దసరా నుంచి కొత్త జిల్లాల్లో పాలన సాగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖల అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించాలని సీఎస్ సూచించారు. కాగా, వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, సికింద్రాబాద్ లను రెండు జిల్లాలుగా విభజించేందుకు మొగ్గు చూపినట్లు, ప్రస్తుతం ఉన్న సిబ్బందినే కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.