: ఉద్యోగాల సునామీని సృష్టించేందుకు నరేంద్ర మోదీ కొత్త ప్లాన్!


ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగాల సృష్టి జరగడం లేదని విమర్శలు పెరుగుతున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ, తన సలహాదారుల టీమ్ తో కలిసి ఓ కొత్త యాక్షన్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎగుమతి ఆధారిత వాణిజ్యాన్ని నౌకాశ్రయాల ద్వారా జరపాలన్న వ్యూహం అమలు చేస్తే, భారీ ఎత్తున నూతన ఉద్యోగాలను సృష్టించవచ్చని వీరు అంచనాకు వచ్చి, మెగా కోస్టల్ జోన్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చైనా తరువాత, ఆ స్థాయిలో కార్మిక శక్తిని కలిగివున్న ఏకైక దేశంగా, ఇండియాలో కోస్టల్ జోన్లు అందుబాటులోకి వస్తే, ఉద్యోగ కొరత తీరుతుందన్నది మోదీ సలహాదారులు ఇచ్చిన సూచన. కోస్టల్ జోన్ల ఏర్పాటు కోసం నీతి ఆయోగ్ బలమైన రోడ్ మ్యాప్ ను ఇప్పటికే సిద్ధం చేసిందని అధికార వర్గాల సమాచారం. చైనా, సౌత్ కొరియా, జపాన్ దేశాల అభివృద్ధికి ఎగుమతులే ముఖ్య కారణమని, ఇండియాకు అపార సముద్రతీరం ఉన్నా వినియోగించుకోలేక పోతున్నామని అభిప్రాయపడ్డ నీతి ఆయోగ్ చైర్మన్ పనగారియా, ఉద్యోగ సృష్టిలో పెద్ద పెద్ద కంపెనీలు విఫలమవుతున్నాయని, ఈ కంపెనీలను తీర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని ప్రధానికి సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సాగరమాల ప్రాజెక్టును చేపట్టి దేశంలోని నౌకాశ్రయాలను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు నడుంబిగించిన మోదీ సర్కారు, తదుపరి రెండేళ్లలో మరిన్ని ఎగుమతులను ప్రోత్సహిస్తూ పలు ప్రత్యేక రాయితీలను సైతం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తీరాలను అభివృద్ధి చేస్తే, లక్షలాది మందికి ఉపాధిని దగ్గర చేయవచ్చన్నది మోదీ అభిమతం. కాగా, గత సంవత్సరం చైనా 56 బిలియన్ డాలర్ల విలువైన ఫుట్ వేర్ ను ఎగుమతి చేయగా, ఇండియా నుంచి కేవలం 3 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు మాత్రమే జరిగాయి. చైనా 782 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను విదేశాలకు పంపగా, ఇండియా 9 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులనే ఎగుమతి చేసింది.

  • Loading...

More Telugu News