: డెంటిస్ట్ అవసరం లేదు.. హెలికాప్టర్ తో పన్ను పీకేశాడు!
వార్తల్లోకి ఎక్కాలనుకునే వాళ్లు రకరకాల సాహసాలు చేస్తుంటారు. అమెరికాలోని వర్జీనియాకు చెందిన రిక్ రహీమ్ అనే హెలికాప్టర్ పైలట్ కూడా అలాంటి చిన్న సాహసం చేశాడు. పైగా, దీనికి తన ఏడేళ్ల కొడుకు కార్సన్ ని ఎంచుకున్నాడు. కార్సన్ కి ఇటీవల పాలపళ్లు ఊడుతున్నాయి. అందులో ఓ పన్ను బాగా కదిలిపోయి ఇబ్బంది పెడుతోంది. దీంతో ఆ పన్నును ఊడగొట్టేందుకు డెంటిస్టు ఎందుకని అనుకున్నాడో ఏమో కానీ... ఆ పన్నుని తన హెలికాప్టర్ తో ఊడగొట్టాడు. కార్సన్ ని హెలిపాడ్ వద్ద నించోబెట్టి, అతని పన్నుకి ఓ పెద్ద దారాన్ని గట్టిగా కట్టి, తను వెళ్లి హెలికాప్టర్ని మెల్లగా పైకి పోనిచ్చాడు. అంతే... ఫటుక్కుమని ఆ బుడతడి పన్ను ఊడొచ్చింది. ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ సందర్భంగా రిక్ రహీమ్ మాట్లాడుతూ, అప్పుడప్పుడు ఇలాంటి చిన్న సాహసంతో కూడిన చిలిపి పనులు చేయాలని సలహా ఇస్తున్నాడు. గతంలో డ్రోన్ లు, వాహనాలు పన్నుకి కట్టి ఊడగొట్టిన సందర్భాలున్నా...హెలికాప్టర్ తో పన్ను ఊడగొట్టిన ఘనత తనకే చెందుతుందని ఘంటాపథంగా సోషల్ మీడియాలో చాటింపు వేస్తున్నాడు.