: తెలంగాణ మంత్రుల ఇళ్ల ముట్టడికి ఏబీవీపీ విఫలయత్నం
తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు మంత్రుల నివాస సముదాయాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో హైదరాబాదు, బంజారాహిల్స్ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులు వస్తున్నారని ముందుగానే తెలుసుకున్న పోలీసులు ప్రధాన రహదారికి బారికేడ్లు అడ్డుపెట్టి వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పెద్దఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. వీరిని అరెస్ట్ చేసి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించిన సందర్భంలో కొంత వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఆపై ప్రత్యేక బలగాలను రప్పించిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగా తరలించారు.