: సిద్దూ కేబినెట్ ప్రక్షాళన ఎఫెక్ట్!... కన్నడ నాట హైటెన్షన్!
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మొన్న తన కేబినెట్ ను సమూలంగా ప్రక్షాళన చేశారు. తన కేబినెట్ లోని 14 మందికి ఉద్వాసన పలికిన సిద్దూ...కొత్తగా 13 మందికి చోటిచ్చారు. ఉద్వాసనకు గురైన నేతల్లో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలున్నారు. అదే సమయంలో కేబినెట్ లో కొత్తగా చేరిన వారిలో చాలా మంది మంత్రి పదవులకు కొత్తవారే. కొత్తగా మంత్రులుగా మారిన వారిలో 9 మందికి కేబినెట్ ర్యాంకులిచ్చిన సిద్ధరామయ్య... మిగిలిన నలుగురికి సహాయ మంత్రి హోదా ఇచ్చారు. సిద్దూ కీలక అడుగుతో ఉద్వాసనకు గురైన మంత్రుల అనుచరులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఫలితంగా ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరు సహా రాష్ట్రంలో పలు పట్టణాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. తమ నేతలను ఇంటికి పంపడంపై ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న కార్యకర్తలు రోడ్డెక్కి విధ్వంసాలకు దిగుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.