: గెస్ట్ హౌస్ లో లింగారెడ్డి... బయట అరుగుపై వరదరాజులరెడ్డి!... కడప జిల్లా టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
కడప జిల్లా టీడీపీలో మరోమారు విభేదాలు భగ్గుమన్నాయి. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వరదరాజుల రెడ్డి, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెల లింగారెడ్డి వర్గాల మధ్య ఈ విభేదాలు పొడచూపాయి. ఇందుకు నిన్న సాయంత్రం ప్రొద్దుటూరు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో జరిగిన ఆ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం వేదికగా నిలిచింది. సమన్వయకర్త హోదాలో వరదరాజుల రెడ్డి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కమిటీలో సభ్యుడు కాని లింగారెడ్డి హాజరయ్యారు. దీంతో ఆది నుంచి వైరి వర్గంగా ఉన్న లింగారెడ్డి సమావేశానికి హాజరుకావడంపై వరదరాజులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లింగారెడ్డి వర్గీయులు... తమకెందుకు సమన్వయ కమిటీలో చోటివ్వలేదో చెప్పాలంటూ వాదనకు దిగారు. ఇరువురు నేతల మధ్య మాటా మాటా పెరగడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు వరదరాజుల రెడ్డి ప్రకటించి బయటకు వచ్చారు. విషయం తెలుసుకున్న ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో తన అనుచరులతో లింగారెడ్డి గెస్ట్ హౌస్ లో కూర్చోగా, వరదరాజుల రెడ్డి గెస్ట్ హౌస్ ఆవరణలో గది బయట అరుగుల మీద తిష్ట వేశారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన నేతలతో కొందరు పార్టీ నేతలు విడివిడిగా చర్చలు జరిపి... ఉద్రిక్తతలకు తెర దించారు. విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్న మధ్యవర్తుల మాటలతో వెనక్కు తగ్గిన వరదరాజుల రెడ్డి, లింగారెడ్డిలు... తాము కూడా అధిష్ఠానం వద్దే తేల్చుకుంటామని అక్కడి నుంచి వెళ్లిపోయారు.