: అంబులెన్స్ కు దారి ఇవ్వని నగరం గ్లోబల్ సిటీ ఎలా అవుతుంది?: కేటీఆర్ కామెంట్
తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హైదరాబాదులోని స్థితిగతులకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కొద్దిసేపటి క్రితం జీహెచ్ఎంసీ వర్క్ షాప్ ప్రారంభమైంది. నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు కేటీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి మందికి పైగా నివసిస్తున్న హైదరాబాదు చిన్న వర్షానికే చిత్తడిగా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్క్ షాప్ కు బయలుదేరిన తాను వర్షం కారణంగా ట్రాఫిక్ జాం కాగా 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చానని ఆయన ప్రస్తావించారు. ట్రాఫిక్ జాంలతో పలు సందర్భాల్లో ఆపదలో ఉన్న రోగులను ఆసుపత్రులకు తరలించే అంబులెన్స్ లకు దారే లేకుండా పోతోందన్నారు. అంబులెన్స్ లకు కూడా దారి ఇవ్వని నగరం... గ్లోబల్ సిటీగా ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇకనైనా నగరంలో రవాణా వ్యవస్థను చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం మూస విధానాలకు స్వస్తి చెప్పాలని ఆయన అధికారులకు సూచించారు. అంతేకాక నగరంలోని ప్రజలందరికీ ఆవాసం కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైతే జీహెచ్ఎంసీ చట్టాలకు సవరణలు చేయాలని ఆయన సూచించారు.