: తిరుమలలో భారీ వర్షం... శ్రీవారి ఆలయంలో రెండడుగుల వర్షపునీరు!
నిన్న రాత్రి నుంచి తిరుమల గిరుల్లో కురుస్తున్న భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో పడుతున్న వర్షం భక్తులను తీవ్ర ఇబ్బందులు పెడుతుండగా, శ్రీవారి ఆలయంలో రెండు అడుగుల మేరకు నీరు వచ్చి చేరింది. ఈ నీటిని హై కెపాసిటీ మోటార్లతో బయటకు తోడేసే పనులను టీటీడీ చేపట్టినప్పటికీ, భారీ వర్షం పడుతూ ఉండటంతో ఎప్పటికప్పుడు కొత్త నీరు వచ్చి చేరుతోంది. దీంతో స్వామివారి దర్శనానికి ఆటంకం కలుగుతోంది. ఈ ఉదయం కల్యాణ సేవకు వచ్చిన వారు ఆలయంలోకి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంలో తడుస్తూనే క్యూ కాంప్లెక్స్ లోకి భక్తులు వెళ్లడం కనిపించింది. మరోవైపు అద్దెగదులు లభించని పరిస్థితి నెలకొని ఉండటంతో, తలదాచుకునే చోటు లేక వేలాది మంది భక్తులు రేకుల షెడ్ల కిందే జల్లుకు తడుస్తూ, చలిలో కాలం గడుపుతున్నారు.