: తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్... కారెక్కనున్న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి!
వాకిటి సునీతా లక్ష్మారెడ్డి... తన భర్త మరణంతో రాజకీయాల్లోకి వచ్చి, అనూహ్యంగా రాణించి, కాంగ్రెస్ మహిళా నేతగా ఎదిగి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల క్యాబినెట్లలో మంత్రిగా పనిచేశారు కూడా. గతంలో ఆమె టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ, ఖండిస్తూ వచ్చిన ఆమె, ఈ దఫా మాత్రం కారెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయనతో కలిసి చర్చించిన ఆమె, రాజకీయ భవిష్యత్ ఉండాలంటే, టీఆర్ఎస్ లో చేరడం మినహా మరో మార్గం లేదని భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించని వేళ, నమ్ముకున్న కార్యకర్తలు, నర్సాపూర్ నియోజకవర్గ అభివద్ధి కోసం గులాబీ కండువా కప్పుకోవాలని ఆమె సన్నిహితులు సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు, సునీతా లక్ష్మారెడ్డిని బుజ్జగించే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ తో ఉంటేనే మేలు జరుగుతుందని, టీఆర్ఎస్ పాలన మూన్నాళ్ల ముచ్చటేనని ఆమెకు సర్దిచెబుతున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. టీఆర్ఎస్ లో చేరే విషయంలో ఇప్పటివరకూ అధికారికంగా స్పందించని సునీత, త్వరలోనే నిర్ణయం ప్రకటించవచ్చని తెలుస్తోంది.