: పొలంలో రైతును చంపేసి, శవం పక్కన తిష్ట వేసిన ఎలుగు!
తెలంగాణలోని పాలమూరు జిల్లాలో నేటి ఉదయం దారుణ ఘటన వెలుగు చూసింది. అడవిలో నుంచి పొలాల్లోకి వచ్చేసిన ఓ ఎలుగుబంటి... తనను రక్షించేందుకు వచ్చిన ఓ రైతును చంపేసింది. ఆ తర్వాత శవం పక్కనే ఆ ఎలుగు తిష్ట వేసింది. వివరాల్లోకెళితే... మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం గుంపన్ పల్లి తండాలో అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు బొజ్జా నాయక్ అనే రైతు తన పొలం చుట్టూ వల ఏర్పాటు చేశారు. పొలం వద్దకు వచ్చిన ఓ ఎలుగు అందులో చిక్కుకుంది. దానిని వల నుంచి తప్పించేందుకు యత్నించిన బొజ్జా నాయక్ పై ఆ ఎలుగు దాడి చేసింది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కదలని ఎలుగు నాయక్ మృతదేహం పక్కనే కూర్చుండిపోయింది.