: ఎవరొచ్చినా ఆర్బీఐ మనుగడకు వచ్చే ఇబ్బందేమీ లేదు: రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్య
భారత రిజర్వ్ బ్యాంకు ప్రస్థానానికి సంబంధించి ఆ సంస్థ గవర్నర్ గా త్వరలో పదవీ విరమణ చేయనున్న రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ గా ఎవరొచ్చినా ఆర్బీఐ మనుగడకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ద ఎకానమిస్ట్’ తన తాజా సంచికలో రాజన్ కామెంట్స్ ను ప్రముఖంగా ప్రస్తావించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ ఎకానమిస్ట్ గా ఉన్న రాజన్ ను... 2013లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏరికోరి భారత్ కు తీసుకొచ్చారు. ఆర్బీఐ గవర్నర్ పగ్గాలు ఆయనకు అప్పగించారు. ఒక్క భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ రాజన్ కు మంచి ఆర్థిక వేత్తగా పేరుంది. ఈ క్రమంలో ఆర్బీఐ గవర్నర్ గా రెండో దఫా పదవీ బాధ్యతలు చేపట్టే ఉద్దేశం లేదని ఇప్పటికే తేల్చేసిన రాజన్.. ఆ సంస్థకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆర్బీఐపై ఏ వ్యక్తి తన ముద్ర వేయలేరు. గవర్నర్ గా ఎవరు వచ్చినా ఆర్బీఐ మనుగడకు వచ్చే ఇబ్బందేమీ లేదు’’ అని రాజన్ వ్యాఖ్యానించారు.