: పార్టీ ఫిరాయించడమనేది వ్యక్తిగతంగా నాకు నచ్చదు: స్పీకర్ కోడెల శివప్రసాద్
గత రాజకీయాలకు భిన్నంగా ప్రస్తుత రాజకీయాలు సాగుతున్నాయని, అవకాశవాద రాజకీయాలు వచ్చాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా ఈ తరహా రాజకీయాలే కనిపిస్తున్నాయన్నారు. పార్టీ ఫిరాయించడమనేది వ్యక్తిగతంగా తనకు నచ్చదని, అయితే, జరుగుతున్న విషయాలను గమనిస్తున్నానని, స్పీకర్ గా తానేమి చేయాలో అది చేస్తానని అన్నారు. ‘అన్న ఎన్టీఆర్ పిలిచి సీటు ఇచ్చారు. రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యం పెరిగింది. 1983లో రూ.30 వేలు ఖర్చు పెట్టి గెలిచా... మొన్న ఎలక్షన్లలో రూ.11.5 కోట్లు ఖర్చు పెట్టాను. ఎన్నికల ఖర్చు కోసం కొందరు అవినీతికి పాల్పడుతున్నారు. నేను ఫ్యాక్షనిస్టును కాదు.. ఫ్యాక్షన్ బాధితుడిని. నాపై నాలుగుసార్లు బాంబు దాడులు జరిగాయి. ఫ్యాక్షనిస్టు అనిపించుకుంటే ఎవరూ దగ్గరకు రారని ఒక పెద్దాయన నాకు సలహా ఇచ్చారు’ అని కోడెల పేర్కొన్నారు. ప్రజాభిమానానికి నిదర్శనంగా తనను ‘పల్నాటిపులి’ అని అంటుంటారని అన్నారు.