: పిలవకుండా పోయే ఖర్మేంటి... పిలిస్తేనే వెళ్లాను: విజయ్ మాల్యా
లండన్ లో పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తనకు ఆహ్వానం ఉందని, పిలిస్తేనే తాను వెళ్లానని బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయల నిధులు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు. లండన్ లో జరగిన కార్యక్రమానికి మాల్యా వెళ్లడం, అదే ప్రోగ్రామ్ కు భారత హై కమిషనర్ హాజరు కావడంపై తీవ్రవిమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మాల్యా, పిలవకుండా పోవాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. "నా జీవితంలో ఎన్నడూ పిలవని పేరంటానికి వెళ్లలేదు. అసలు అలాంటి చోట్లకు ఎన్నడూ వెళ్లను కూడా. నాకు ఆహ్వానం ఉంది" అని తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ పోస్టు పెట్టారు. రచయిత తనకు మిత్రుడని, అతని కోసం వెళ్లానని, తన కుమార్తెతో కలసి పెద్దలు చెప్పిన విషయాలను విన్నానని, ఆపై అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాతే, వార్తల్లో నిలిచానని చెప్పుకొచ్చాడు. "నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవు. చార్జ్ షీట్ లేదు. ఏదైనా ఆరోపించే ముందు నా వాదన చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇది దురదృష్టకరం" అని ఆయన ట్వీట్ చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, మాల్యాను ఎవరూ పిలవలేదని విదేశాంగ శాఖ వెల్లడించిన నేపథ్యంలో మాల్యా ఈ ప్రకటన చేయడం గమనార్హం.