: రూ. 100 కోట్ల ప్రజా ధనం నొక్కేసిన ఉమా రిసార్ట్స్ లిమిటెడ్
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో మరో చిట్ ఫండ్ సంస్థ ప్రజలను మోసం చేసింది. వంద కోట్లకు పైగా డిపాజిట్లను ప్రజల నుంచి సేకరించిన ఉమా రిసార్ట్స్ ఇండియా లిమిటెడ్ యాజమాన్యం బోర్డు తిప్పేయగా, ప్రభుత్వం సీరియస్ అయింది. ఉమా చిట్ ఫండ్ కంపెనీ పేరిట నమ్మకంగా వ్యాపారాన్ని ప్రారంభించిన వారు, ప్రజల అమాయకత్వాన్ని, నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని భారీ ఎత్తున డిపాజిట్లు తీసుకుని, గడువు తీరినప్పటికీ సొమ్ములు చెల్లించలేదు. దీంతో పలువురు ఫిర్యాదులు చేయగా, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కంపెనీపై దాడులు చేసి దాని ఆస్తులను సీజ్ చేశారు. కాగా, 2006లో ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకులో ఉమా రిసార్ట్స్ తీసుకున్న రూ. 3 కోట్ల రుణం, ఇప్పుడు వడ్డీతో కలిపి రూ. 10 కోట్లకు చేరింది. ఇప్పుడా సంస్థ ఆస్తులను వేలం వేసి ప్రజల డబ్బు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. తక్షణం తమ డిపాజిట్లను వెనక్కు ఇప్పించకుంటే, ఉద్యమిస్తామని చిట్ ఫండ్ సంస్థకు డబ్బు డిపాజిట్ చేసిన ప్రజలు హెచ్చరిస్తున్నారు.