: ముస్లిం టీచరును బురఖా తీసేయమన్న శ్రీనగర్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్


ఓ ముస్లిం టీచరును బురఖా తీసేయాలని శ్రీనగర్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఆదేశించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించి, స్కూలు యాజమాన్య వైఖరిని ఎండగట్టారు. జమ్మాకాశ్మీర్ ఏమీ ఫ్రాన్స్ కాదని, ప్రజల డ్రస్ కోడ్, మత విశ్వాసాలపై స్కూలుకు ఎలాంటి హక్కూ లేదని అన్నారు. పాఠశాలలోని సైన్స్ టీచర్, రోజుటి మాదిరిగానే బురఖాతో స్కూలుకు రాగా, ఆమెను అడ్డుకున్న యాజమాన్యం, ఇస్లామిక్ డ్రస్ తీసేసిన తరువాత మాత్రమే లోపలికి రావాలని ఆదేశించారు. ఆమె కేవలం మూడు నెలల ముందు మాత్రమే స్కూల్లో చేరినట్టు తెలుస్తోంది. బురఖా తీసేసేందుకు ఆమె నిరాకరించగా, శరీరాన్ని పూర్తిగా కప్పే డ్రస్ కావాలో, ఉద్యోగం కావాలో తేల్చుకోవాలని యాజమాన్యం చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఘటన శుక్రవారం నాడు జరుగగా, నిన్నటి నుంచి రాజకీయ రంగు పులుముకుంది. బురఖాను తీసివేయాలని ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఓ రాష్ట్రంలో ఆదేశాలు జారీ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతం కాదని స్వతంత్ర ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విద్యా మంత్రి నయీమ్ అఖ్తర్ సైతం దీన్ని ఖండిస్తూ, స్కూలు వైఖరిపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News