: ధర దిగి వచ్చేనా!... తెలంగాణను కాపాడేందుకు రాజస్థాన్ నుంచి వచ్చిన 'మమ్మీ-డాడీ' రకం టొమాటో!
తెలంగాణలో కిలో టొమాటో ధర రూ. 100ను దాటిన వేళ, పరిస్థితి మరింత చెయ్యి దాటకుండా చూసేందుకు రాజస్థాన్ నుంచి 'మమ్మీ-డాడీ' పేరిట పండుతున్న హైబ్రిడ్ టొమాటో ప్రత్యేకంగా వచ్చింది. తెలంగాణలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ యార్డ్ గా పేరున్న బోయినపల్లి మార్కెట్ కు ఇటీవల 40 వేల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇందులో అత్యధికం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చినదే కావడం విశేషం. వాస్తవానికి గత సంవత్సరం జూన్ తొలివారంలో మార్కెట్ కు వచ్చింది 18 వేల క్వింటాళ్లు మాత్రమే. ఈ సంవత్సరం అందుకు రెట్టింపు స్థాయిలో పంట మార్కెట్ కు వచ్చినప్పటికీ, ధరలు పెరుగుతూ ఉండటానికి కారణం, స్థానికంగా పంట లేకపోవడమేనని నిపుణులు వ్యాఖ్యానించారు. కరవు పరిస్థితుల కారణంగా తెలంగాణ ప్రాంతంలో ఈ ఏడాది టొమాటో పంట లేదని, ఇదే సమయంలో రాజస్థాన్ లో పెద్దఎత్తున దిగుబడి రావడం, ఇక్కడి ధర ఆకర్షణీయంగా ఉండటంతో భారీ ఎత్తున పంట మార్కెట్ కు వస్తోందని, ఈ కారణంగా రెండు మూడు రోజుల్లోనే ధరలు అందుబాటులోకి వస్తాయని ట్రేడర్లు వ్యాఖ్యానించారు. రాజస్థాన్ నుంచి తెలంగాణకు టొమాటో రావడం తామింతవరకూ చూడలేదని కొందరు వ్యాపారులు వ్యాఖ్యానించారు. రాజస్థాన్ నుంచి పంట రాకుంటే, టొమాటో ధరలు మరింతగా పెరిగి వుండేవని అభిప్రాయపడ్డారు.