: ఇక కూరగాయలు, పండ్ల వంతు... కార్గో సేవలను ప్రారంభించిన రైల్వే
పెద్ద మొత్తంలో సరుకులు రవాణా చేస్తున్న రైల్వే తాజాగా కూరగాయలు, పండ్లు, మందుల సరఫరాపైనా దృష్టి సారించింది. ఇందుకోసం గాలి, వెలుతురు ప్రసరించేలా ప్రత్యేకంగా కంటైనర్లను రూపొందించినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సాధారణంగా గూడ్స్ రైళ్లకు సమయపాలన అంటూ ఉండదు. కానీ పండ్లు, కూరగాయలు ఇతర సరుకులను సరఫరా చేసే ఈ రైళ్లు నిర్దిష్ట సమయంలో బయలుదేరి అనుకున్న సమయానికి గమ్యాన్ని చేరుకుంటాయని రైల్వే అధికారులు తెలిపారు. మొదట చెన్నై (తొండియార్‌పేట) నుంచి ఢిల్లీ(ఓక్లా)కి ఈ రైళ్లను నడపనున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి 7 గంటలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెన్నైలో రైలును జెండా ఊపి ప్రారంభించారు. చెన్నైలో బయలుదేరిన ఈ రైలు 61 గంటల ప్రయాణం అనంతరం మంగళవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక(తెల్లవారితే శనివారం) ఒంటి గంటకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై చేరుకుంటుంది. రోడ్డు మార్గంలో జరుగుతున్న కార్గో రవాణాను రైలు మార్గంలోకి ఆకర్షించడమే ఈ రైలు ముఖ్య ఉద్దేశమని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. కాగా ఈనెల 15న సురేష్ ప్రభు ఢిల్లీలో ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ -చెన్నై మధ్య రైళ్లను ప్రారంభించారు.