: వినూత్న మార్గంలో డ్రగ్స్ సరఫరా...పట్టేసిన అమెరికా పోలీసులు
అమెరికా సరిహద్దుల్లోని మెక్సికో నుంచి భారీ ఎత్తున సరఫరా అవుతున్న డ్రగ్స్ ను పోలీసులు పట్టేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ల్యాండ్ స్కేపింగ్ బండ రాళ్ల మధ్య మారిజువానా అనే డ్రగ్ ను పెట్టి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఘటన కలకలం రేపుతోంది. ల్యాండ్ స్కేపింగ్ కోసం ఉపయోగించే పెద్ద పెద్ద బండరాళ్లను ఓ ట్రక్కులో తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు దానిని ఆపారు. దీంతో డ్రగ్స్ ను పసిగట్టే శునకాలతో తనిఖీలు నిర్వహించారు. అవి పెడ్డ బండరాళ్లలో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించడంతో, పోలీసులు వాటికి డ్రిల్లింగ్ చేశారు. దీంతో ఆకుపచ్చని పదార్థం మధ్యలో ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో ఆ బండరాళ్లను పగులగొట్టగా, వాటిల్లోంచి 577 ప్యాకెట్ల రూపంలో ఉన్న 726 కేజీల మారిజువానా డ్రగ్ బయటపడింది. దీని విలువ 5.5 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.