: వెంకయ్య గారూ, స్పందించండి!.. అనర్హత వేటు అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించండి: వైసీపీ నేత భూమన
పార్టీ ఫిరాయింపులతో సతమతమవుతున్న ఏపీలో విపక్ష వైసీపీ పార్టీ సరికొత్త డిమాండ్ ను వినిపించింది. పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హైదరబాదులోని లోటస్ పాండ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా ఈ సరికొత్త డిమాండ్ ను వినిపించారు. ఏపీలో కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపులపై స్పందించాలని ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ అధికార పార్టీ వల విసురుతుండగా, తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తాము చేసిన ఫిర్యాదులకు అసెంబ్లీ స్పీకర్ స్పందించడం లేదని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు చేయాలని ఆయన కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించి ఆ బాధ్యతను ఎన్నికల సంఘానికి అప్పగించాలని ఆయన కోరారు.