: విశాఖలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ!... రోడ్డునపడ్డ 300 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు!
తెలుగు నేలపై మరో నయా మోసం వెలుగుచూసింది. ఐటీ కంపెనీ పేరిట రంగప్రవేశం చేసిన ఓ మోసగాడు... ఆకర్షణీయ వేతనాలతో నిరుద్యోగ యువతను ఆకట్టుకుని భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించి సాగర నగరం విశాఖలో కంపెనీ తెరచి గుట్టు చప్పుడు కాకుండా మాయమయ్యాడు. దీంతో ఎన్నో ఆశలతో ఉన్నదంతా డిపాజిట్లుగా చెల్లించిన 300 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు రోడ్డున పడ్డారు. వివరాల్లోకెళితే... కిరణ్ కుమార్ అనే వ్యక్తి విశాఖ కేంద్రంగా ‘ఎక్సాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట ఐటీ సంస్థను ఏర్పాటు చేశారు. విశాఖలోని ఐటీ పార్క్ లోని హిల్ నెంబర్:2లో కంపెనీని ఏర్పాటు చేసిన అతడు నిరుద్యోగ యువతను బాగానే ఆకట్టుకున్నాడు. ఆకర్షణీయ వేతనాలను ఎరగా వేసిన అతడు తన కంపెనీలో చేరేందుకు వచ్చిన వారి నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించాడు. ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుందని చెప్పిన కిరణ్ కుమార్... శిక్షణ సమయంలో ఇస్తానన్న కనీస వేతనాలను కూడా ఇవ్వలేదు. తీరా శిక్షణ గడువు ముగుస్తున్న నేపథ్యంలో అతడు గుట్టు చప్పుడు కాకుండా పరారయ్యాడు. దీంతో జరిగిన మోసం తెలుసుకున్న బాధితులు పీఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కిరణ్ కుమార్ పై కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చేపట్టారు.