: మేమిచ్చిన నిధులను వాడండి!.. కేసీఆర్ కు కేంద్ర మంత్రి జేపీ నద్దా లేఖ!
అవసరమైన మేరకు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్న వాదనలో పస లేదని తేలిపోతోంది. కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించే విషయంపై దృష్టి సారించని రాష్ట్రాలు... తమకు మరిన్ని నిధులు కావాలని కేంద్రానికి లేఖలు రాస్తున్నాయి. అయితే ఇచ్చిన నిధులను ముందుగా ఖర్చు పెడితే... ఆ తర్వాత తదుపరి నిధుల విడుదలపై యోచిస్తామని కేంద్రం చెబుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. 'ఇచ్చిన నిధులను ఖర్చు చేయండి మహాప్రభో' అంటూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ఎం) కింద ఏటా తెలంగాణకు కేంద్రం రూ.1,000 కోట్లు విడుదల చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 60 శాతం కేంద్ర నిధులు, 40 శాతం రాష్ట్ర వాటాతో కొనసాగే ఈ పథకం అమలుపై తెలంగాణ సర్కారు రెండేళ్లుగా ఆసక్తి చూపడం లేదు. దీంతో గతేడాది కేంద్రం విడుదల చేసిన నిధుల్లో ఇంకా రూ.438 కోట్లు మిగిలే ఉన్నాయి. వీటిలో రూ.143 కోట్లను ఆర్థిక శాఖ నిలిపేసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నద్దా తాను రాసిన లేఖలో సీఎం కేసీఆర్ ను నిధుల వ్యయంపై అప్రమత్తం చేశారు.