: భయపెడుతున్న రిజర్వాయర్లు.. 15 శాతానికి పడిపోయిన నీటి నిల్వలు


ఎన్నడూ లేనంతంగా ఈసారి భానుడు తన ప్రతాపాన్ని చూపడంతో వేసవి మండిపోయింది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మహారాష్ట్రలోని లాతూరు. గుక్కెడు నీళ్ల కోసం లాతూరు ప్రజలు ఎంతగా అల్లాడిపోయిందీ మనం చూశాం. ఇక రుతుపవనాల దోబూచులాటతో వర్షాలు ఇంకా ఊపందుకోలేదు. ఫలితంగా దేశంలో ముఖ్యమైన 91 మేజర్ రిజర్వాయర్లలో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. ఈ రిజర్వాయర్లలో 15 శాతానికి నీటి మట్టం పడిపోయినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. నీళ్లు లేకపోవడంతో రైతులు పంటలు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా వరి, పప్పులు, నూనె గింజల పంటలపై తీవ్ర ప్రభావం పడింది. గతేడాదితో పోలిస్తే పంట విస్తీర్ణం పదిశాతం పడిపోయింది. దేశంలోని ముఖ్యమైన రిజర్వాయర్లలో గత నెల 26 నాటికి 26.81 బిలియన్ క్యూబిక్ మీటర్ల(బీసీఎం) నీటి నిల్వలు ఉండగా జూన్ 16 నాటికి అది 23.78 బీసీఎంలకు పడిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్లు మరింత దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నట్టు సెంట్రల్ వాటర్ కమిషన్ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 3 రిజర్వాయర్లలో 4.86 బీసీఎం నిల్వలు మాత్రమే ఉన్నాయి. అంటే మొత్తం సామర్థ్యంలో అది 9 శాతం మాత్రమే. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిన ఈ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఆరు మేజర్ రిజర్వాయర్లలో వాటి సామర్థ్యంలో 23శాతం నిల్వలు ఉన్నాయి. దయనీయంగా మారిన 91 రిజర్వాయర్లలో 27 పశ్చిమలో ఉండగా,15తూర్పునకు చెందినవి. 12 మధ్య భారతానికి చెందిన రిజర్వాయర్లు ఉన్నాయి. 60 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లు కలిగి ఉన్న మరో 31 రిజర్వాయర్లు చాలా పట్టణాలకు తాగు, సాగునీరు అందిస్తున్నాయి. మందగమనం వీడి రుతుపవనాలు చురుగ్గా కదిలి విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప రిజర్వాయర్లు నిండేలా కనిపించడం లేదు. రైతులు కూడా వరుణుడిపైనే భారం వేసి ఆకాశం కేసి ఆశగా చూస్తున్నారు.

  • Loading...

More Telugu News