: పంజాబీ డ్రెస్ లో వచ్చి... ప్రొఫెషనల్ రెజ్లర్ ను మట్టి కరిపించిన హర్యానా లేడీ!
హర్యానా పోలీస్ శాఖలో పనిచేస్తున్న కవిత... ప్రొఫెషనల్ రెజ్లర్ కాదు. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో గతంలో అనుభవం మాత్రమే ఉంది. హర్యానా పోలీస్ శాఖలో చేరిన తర్వాత దానికి కూడా దూరమయ్యారు. ప్రస్తుతం పోలీసు ఉద్యోగానికీ కూడా ఆమె రాజీనామా చేశారు. అయితేనేం... ఆమెలోని యోధురాలు మాత్రం నిద్ర పోలేదు. ఇటీవల ఢిల్లీలో ‘గ్రేట్ కాళీ’ ఆధ్వర్యంలో ‘కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్’ పేరిట జరిగిన ప్రొఫెషనల్ రెజ్లింగ్ పోటీల్లో భారత ప్రప్రథమ మహిళా రెజ్లర్ బీబీ బుల్ బుల్ ను సింగిల్ దెబ్బకు మట్టి కరిపించారు. రెజ్లింగ్ పోటీలను చూద్దామంటూ ఉత్సాహంగా వచ్చిన కవిత... సాధారణ మహిళలు వేసుకునే పంజాబీ (సల్వార్- కమీజ్) డ్రెస్ లోనే అక్కడికి వెళ్లారు. బుల్ బుల్ సవాల్ తో కవితలోని యోధురాలు కాస్తంత ఆవేశానికి లోనయ్యారు. ముందూ వెనుకా చూడకుండా రింగ్ లోకి దూకేశారు. సవాళ్లు, ప్రతి సవాళ్ల తర్వాత తనపై ఓ పంచ్ విసిరిన బుల్ బుల్ ను... కవిత సింగిల్ దెబ్బతో కింద పడేశారు. అంతే, ప్రొఫెషనల్ రెజ్లర్ తేరుకోలేకపోయింది. రెజ్లర్ ను కిందపడేసిన కవిత... అచ్చమైన ఫ్రొఫెషనల్ మాదిరే పంచ్ లు విసిరారు. దీంతో షాక్ తిన్న నిర్వాహకులు నలుగురు యువకులను రింగ్ లోకి పంపి కవితను నిలువరించారు. అయితే మరోమారు బుల్ బుల్ సవాల్ చేయడంతో రెండో దఫా కూడా కవిత తన పంచ్ పవర్ చూపించారు. రెండో మారు కూడా మొదటి పంచ్ తరహాలోనే కవిత విరుచుకుపడటంతో బుల్ బుల్ కిందపడిపోయింది. ఆ తర్వాత కూడా కవితను నిలువరించడం నిర్వాహకులకు సాధ్యం కాలేదు. ఎలాగోలా కష్టపడి ఇద్దరు యువకులు కవితను నిలువరించి కిందకు పంపారు. ఈ వీడియో ప్రస్తుతం జాతీయ మీడియాలో హల్ చల్ చేస్తోంది.