: ఏపీకి ‘ప్రత్యేక జోన్’ వచ్చేస్తోంది!... 21న లాంఛనంగా ప్రకటించనున్న సురేశ్ ప్రభు


రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక చిక్కుల్లో పడిపోయిన ఏపీకి అవసరమైన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్ విషయాల్లో ఓ అంశంలో ముందడుగు పడింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్ ప్రెస్ ను ‘ఏపీ ఎక్స్ ప్రెస్’గా పిలుచుకునే వాళ్లం. ఆ తర్వాత దానిని తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ‘తెలంగాణ ఎక్స్ ప్రెస్’గా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. నాటి నుంచి విశాఖ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కావాల్సిందేనన్న డిమాండ్ నానాటికి పెరిగిపోయింది. అయితే వీటిలో ఏ ఒక్క దానికి కూడా కేంద్రం సానుకూలంగా స్పందించేందుకు సిద్ధంగా లేకపోవడంతో... ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇటీవల విందు రాజకీయాలకు తెర తీశారు. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తన కోటాలోని ఓ సీటును బీజేపీ నేత, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు ఇచ్చారు. ఈ సందర్భంగా విజయవాడకు వచ్చిన ప్రభుకు విందు ఏర్పాటు చేసిన చంద్రబాబు.. రాష్ట్ర సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాదు నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి తరలివెళ్లే ఉద్యోగుల కోసమంటూ ‘సికింద్రాబాదు- విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్’ పేరిట ప్రత్యేక రైలుకు ప్రభు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైలు ఈ నెల 20న పట్టాలెక్కనుంది. తాజాగా ప్రత్యేక జోన్ కూడా సాకారం దిశగా ప్రభు నుంచి నిన్న చంద్రబాబు సర్కారుకు మరో వార్త చేరింది. ‘సౌత్ ఈస్ట్ కోస్ట్ జోన్’ పేరిట ఏర్పాటు కానున్న ఈ జోన్ ను త్వరలోనే ప్రభు స్వయంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ నెల 21న ఈ మేరకు ప్రభు ఈ జోన్ పై ప్రకటన చేస్తారన్న సమాచారం కూడా ఏపీకి చేరినట్లు తెలుస్తోంది. ఆది నుంచి ప్రత్యేక రైల్వే జోన్ కు సంబంధించి తీవ్ర వ్యతిరేకతతో ఉన్న రైల్వే బోర్డు చైర్మన్ కూడా సురేశ్ ప్రభు సానుకూలతతో తన వైఖరి మార్చుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News