: గౌతమ్ మీనన్ దయవల్ల మూడు సార్లు ప్రేమలో పడ్డాను: సాయి ధరమ్ తేజ్
గౌతమ్ మీనన్ దయవల్ల మూడు సార్లు ప్రేమలో పడ్డానని యువ నటుడు సాయి ధరమ్ తేజ్ అన్నాడు. 'సాహసం శ్వాసగా సాగిపో' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'ఘర్షణ' చూసిన తరువాత బాగా చదువుకున్న అమ్మాయితో ప్రేమలో పడాలని భావించి, అమెరికాలో ఉన్న ఓ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వెళ్లానని అన్నాడు. తాను వెళ్లే సరికే అక్కడ ఎవడి ప్రేమలోనో ఆ అమ్మాయి పడిపోయిందని అన్నాడు. దీంతో చేసేది లేక వెనక్కి వచ్చేశానని చెప్పాడు. ఆ తరువాత 'ఏం మాయ చేశావే' చూసి ఇంకో అమ్మాయిని ప్రేమించానని అన్నాడు. ఆ అమ్మాయి 'ముందు కెరీర్ మీద ధ్యాసపెట్టు' అని సూచించడంతో అదీ వర్కౌట్ కాలేదని చెప్పాడు. 'ఎటో వెళ్లిపోయింది మనసు' చూసి మరో అమ్మాయి ప్రేమలో పడితే తను కూడా హ్యాండిచ్చిందని తెలిపాడు. ఇలా లాభం లేదని 'సాహసం శ్వాసగా సాగిపో' అని నిర్ణయించుకున్నానని సాయిధరమ్ తేజ్ చమత్కరించడంతో సభికుల క్లాప్స్ తో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.