: హిల్లరీ చరిత్ర సృష్టించారు...మహిళలంతా గర్వపడాలి: జయలలిత
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడనున్న హిల్లరీ క్లింటన్ ను అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభినందించారు. ఈ మేరకు హిల్లరీ క్లింటన్ కు అభినందన సందేశం పంపారు. ఆ సందేశంలో 'అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీ తరపున నామినేషన్ పొందిన తొలి మహిళా అధ్యక్ష అభ్యర్థిగా మీరు చరిత్ర సృష్టించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మహిళలంతా గర్వపడాల్సిన విషయం, ఇది అసాధారణ విషయం. భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా మహిళా సాధికారతకు పాటుపడతారని, మీ గళం వినిస్తారని ఆశిస్తున్నా' అంటూ ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2011లో భారత పర్యటనకు అమెరికా విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్ వచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు.