: వాజ్‌పేయి, అద్వానీల పక్కన కూర్చోగలనని ఊహించలేదు: వెంకయ్య ఆసక్తికర ప్రసంగం
తాను రాజకీయాల్లోకి వచ్చేముందు వాజ్‌పేయి, అద్వానీ లాంటి గొప్ప నాయకుల పక్కన కూర్చోగలనని ఊహించలేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా మరోసారి ఎన్నికైన అనంతరం తొలిసారి హైదరాబాద్‌కి వచ్చిన ఆయనకు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమ్మిన దానికి కట్టుబడి ఉన్నానని, కష్టపడి పనిచేశానని అందుకే బీజేపీలో మంచి పేరు తెచ్చుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ‘రాజకీయ జీవితంలో నేనెప్పుడూ రాజీ పడను, పడలేదు.. ఆటు పోట్లను ఎదుర్కుంటూ ముందుకు వెళితేనే విజయం వస్తుంది. నా నిబద్ధతతోనే బీజేపీలో మంచి పేరు తెచ్చుకున్నాను.’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా రాజకీయాలు మారాల్సి ఉందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందే విధంగా రాజకీయాలు, రాజకీయ నాయకులు మారాలని ఆయన అన్నారు. ‘ఇకపై పరోక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయను’ అని ఆయన తెలిపారు. ప్రజా సేవకు పదవులు అక్కర్లేదని ఆయన అన్నారు.