: పది రోజులు దాటినా వీడని నావీ అధికారి కుమార్తె అదృశ్యం మిస్టరీ!


శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఈ నెల 14న అదృశ్యమైన నావీ అధికారి అరవింద్ కుమార్ కుమార్తె ఖైరవీ శర్మ (17) ఆచూకీని పోలీసులు ఇంకా కనిపెట్టలేక పోయారు. విశాఖ నుంచి పుణెకు వెళుతూ, మార్గ మధ్యంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె, అక్కడి నుంచి పుణెకు విమానం ఎక్కలేదు. ఆమె ఎటువెళ్లిందన్న విషయమై ఇంతవరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. వాస్తవానికి కనెక్టింగ్ విమానం ఎక్కేవారెవరూ విమానాశ్రయం బయటకు వెళ్లరు. కానీ, శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ చేరుకున్న ఆమె, బయటకు వచ్చి ఓ పుష్పక్ బస్సు ఎక్కినట్టు గుర్తించిన పోలీసులు, ఆపై ఆమె సెల్ ఫోన్ బోయినపల్లి వరకూ వెళ్లినట్టు మాత్రమే గుర్తించారు. ఆపై సెల్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో, ట్రేసింగ్ కష్టమైపోయింది. ఖైరవీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినా, ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక తనంతట తానే ఎటైనా వెళ్లిందా? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం చిక్కలేదు. త్వరలోనే కేసు మిస్టరీని ఛేదిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News