: 69 మంది మరణానికి కారణమైన వారికి ఇంత తక్కువ శిక్షలా?: బాధిత కుటుంబాలు


సంచలనం సృష్టించిన గుల్బర్గా సొసైటీ నరమేధం కేసులో శిక్షల ఖరారుపై నేడు తీర్పు వెలువడగా, బాధిత కుటుంబాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ ఘటనలో 69 మంది చనిపోగా, నిందితులకు విధించిన శిక్షలు తమకు సంతృప్తిని కలిగించలేదని, ఇప్పటికీ తమకు అన్యాయమే జరిగిందని నాడు హత్యకు గురైన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రి సతీమణి జకియా జాఫ్రి ఆరోపించారు. ఈ కేసులో 11 మందికి జీవిత ఖైదు, ఒకరికి పదేళ్లు, 12 మందికి ఏడేళ్ల జైలు శిక్ష పడ్డ సంగతి తెలిసిందే. ఉరిశిక్షలు పడాల్సిన వారికి తక్కువ శిక్షలు వేశారని, దీనిపై తాము పై కోర్టుకు వెళతామని జకియా స్పష్టం చేశారు. కేసులో ప్రమేయం ఉన్నప్పటికీ 36 మందిని నిర్దోషులుగా ప్రకటించారని, దీన్ని కూడా సవాల్ చేస్తామని తెలిపారు. "నాకు సంతృప్తి కలగలేదు. నేను సంతోషంగా లేను. నా లాయర్ ను మళ్లీ సంప్రదిస్తాను. ఈ తీర్పు న్యాయం కాదు" అని ఆమె వ్యాఖ్యానించారు. నిందితుల క్రూరత్వానికి ఏడేళ్ల, పదేళ్ల శిక్షలు ఎంతమాత్రమూ చాలవని అన్నారు. ఇదే కేసులో బాధితుల తరఫున పోరాడుతున్న తీస్తా సెత్వలాడ్ సంస్థ స్పందిస్తూ, "తీర్పును స్వాగతిస్తున్నాం. అయితే ఇంత తక్కువ శిక్షలు మాకు అసంతృప్తిని కలిగించాయి" అని ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News