: కేసీఆర్ వ్యాఖ్యలతో బిత్తరపోయిన ఆర్టీసీ అధికారులు


"తెలంగాణలో 95 ఆర్టీసీ డిపోలుంటే 90 చోట్ల నష్టాలా? ఇన్ని నష్టాలతో ఆర్టీసీని కొనసాగించడం ఎందుకు? మూసేద్దాం" అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఆర్టీసీ అధికారులు బిత్తరపోయారు. సంస్థ ఆర్థిక పరిస్థితిపై చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు, చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్, ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నా, అధికారుల అలసత్వం కారణంగానే నష్టాలు నమోదవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికులు కోరిన దానికన్నా అధికంగా 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని గుర్తు చేసిన ఆయన, అయినా ఉద్యోగుల పనితీరు మెరుగుపడకపోగా, మరోసారి సమ్మె నోటీసులు ఇస్తారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన, ఏకంగా ఆర్టీసీని మూసేస్తానని చెప్పడంతో అధికారులు నీళ్లు నమిలినట్టు సమాచారం. కనీసం సగం డిపోలన్నా లాభాల్లో ఉండాలని, అందుకు కొత్త ఆలోచనలు చేయాలని, అవసరమైతే ప్రయాణికుల ఇళ్ల వరకూ బస్సులు నడపాలని, వాణిజ్య ప్రకటనలపై దృష్టి పెట్టాలని, జాతరలు, పుష్కరాలకు మరిన్ని బస్సులు నడపాలని సూచించారు. ఆర్టీసీలో దైవదర్శనాల నిమిత్తం వెళ్లే వారికి పుణ్యక్షేత్రాల్లో వసతి సులువుగా లభించేలా చర్యలు చేపట్టాలని కేసీఆర్ సూచించారు. పర్యాటక శాఖతో అనుసంధానం కావాలని, తద్వారా లాభాల బాట పట్టవచ్చని సలహాలు ఇచ్చారు. ఇక ఆర్టీసీ అధికారులు ఉద్యోగుల డిమాండ్లను కేసీఆర్ ముందుంచగా, జీహెచ్ఎంసీ నుంచి కొన్ని నిధులను ఇప్పించేందుకు మాత్రమే కేసీఆర్ హామీ ఇచ్చారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News