: చంద్రబాబు విందు రాజకీయం ఫలించింది!... ‘రాజధాని’ ఉద్యోగులకు ప్రత్యేక రైలుకు ఓకే చెప్పిన కేంద్రమంత్రి!


కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అవసరమైన పలు ప్రయోజనాలను రాబట్టుకునేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రారంభించిన విందు రాజకీయాలు ఫలిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల విజయవాడకు వచ్చిన బీజేపీ నేత, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు విందు ఇచ్చిన చంద్రబాబు... రాష్ట్ర సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో నిర్దేశిత గడువు (ఈ నెల 27)లోగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న తాత్కాలిక రాజధానికి ఉద్యోగులు తరలివచ్చేందుకు అయిష్టత చూపుతున్న విషయం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. వారానికి ఐదు రోజుల పనిదినాలను అమల్లోకి తెస్తున్నామన్న చంద్రబాబు.. హైదరాబాదులోని కుటుంబాల వద్దకు ఉద్యోగులు వెళ్లి వచ్చేలా ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని ప్రభును కోరారు. ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పిన ప్రభు సికింద్రాబాదు- విజయవాడల మధ్య ఓ ప్రత్యేక రైలును నడిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ రైలు సికింద్రాబాదు- విజయవాడల మధ్య పట్టాలెక్కనుంది. వారానికి మూడు రోజుల పాటు తిరగనున్న ఈ రైలు... సికింద్రాబాదు నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి ఉదయానికి విజయవాడ చేరుతుంది. అదే సమయంలో విజయవాడలోనూ రాత్రి 10 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయానికే సికింద్రాబాదు చేరుతుందట. ఇప్పటికే ఈ రైలుకు అవసరమైన కోచ్ లను కూడా సిద్ధం చేసిన రైల్వే శాఖ... మరో పది రోజుల్లో ఈ రైలును పట్టాలెక్కించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News