: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన పలమనేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి
చిత్తూరు జిల్లా పలమనేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి టీడీపీలో చేరారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటుగా పలమనేరుకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కాగా, గత ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న అమరనాథ్ రెడ్డి మళ్లీ సొంత గూటికి చేరినట్టైంది. అలాగే, చిత్తూరు జిల్లా నుంచి వైఎస్సార్సీపీలో చేరిన తొలి నేత అమరనాథ్ రెడ్డి కావడం విశేషం. దీంతో ఈ జిల్లాలో రెండు పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య సమమైంది. మరోవైపు వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన వారి సంఖ్య 20 కి చేరింది. రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలనే లక్ష్యంతో పాటుగా, చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితుడినై టీడీపీలో చేరినట్టు అమరనాథ్ రెడ్డి తెలిపారు.