: యూపీలో కూడా బీజేపీతో కలిసే ఉంటాం: ఎల్‌జేపీ నేత చిరాగ్ పాశ్వాన్
ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఛాంపియన్ అయ్యేందుకు రాజకీయ పార్టీలన్నీ తమ తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఈ క్రమంలో ముందు పొత్తులు, సీట్ల విషయంలో ఓ అంచనాకు వస్తే బాగుంటుందని పలు పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్ జన శక్తి (ఎల్‌జేపీ) ఈ ఎన్నికల్లో కూడా బీజేపీతో కలిసే నడవాలని భావిస్తోంది. పొత్తు ప్రతిపాదన బీజేపీ నాయకత్వానికి పంపామని, దీనిపై బీజేపీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన తరువాత సంయుక్త ప్రకటన విడుదల చేస్తామని ఆయన చెప్పారు. కేంద్రంలో తమ కూటమి అద్భుతమైన పాలన అందిస్తోందని, పొత్తులు తేలాక, పోటీ విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.