: చిత్తూరులో పెరగనున్న టీడీపీ బలం!... వైసీపీతో సరిసమాన సంఖ్యలో టీడీపీ ఎమ్మెల్యేలు!


టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో గడచిన ఎన్నికల్లో ఆయన పార్టీ కంటే విపక్ష పార్టీ వైసీపీనే అధిక స్థానాలు గెలుచుకుంది. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా... గడచిన ఎన్నికల్లో కుప్పం నుంచి బరిలోకి దిగిన చంద్రబాబు విజయం సాధించగా... చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లె, సత్యవేడు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. అంటే 14 స్థానాల్లో టీడీపీ ఆరింటిలో మాత్రమే విజయం సాధించింది. ఇక మిగిలిన 8 నియోజక వర్గాలు పూతలపట్టు, చంద్రగిరి, నగరి, పీలేరు, మదనపల్లె, గంగాధర నెల్లూరు, పుంగనూరు, పలమనేరుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వెరసి అధికార పార్టీ కంటే విపక్షమే చిత్తూరు జిల్లాలో బలంగా ఉంది. ఇక ఇటీవల టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు నిన్నటిదాకా చిత్తూరు జిల్లాలో ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా చిక్కలేదు. తాజాగా గతంలో టీడీపీలో కొనసాగిన పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమర్ నాథ్ రెడ్డి నేటి సాయంత్రం తన సొంత గూటికి చేరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిలెక్కనున్నారు. దీంతో జిల్లా రాజకీయాల్లో అధికార, విపక్షాల బలాబలాలు సరిసమానం కానున్నాయి. అమర్ నాథ్ రెడ్డి జంపింగ్ తో 8 మంది బలం ఉన్న వైసీపీ బలం 7కు పడిపోనుండగా, ఆరుగురు సభ్యులున్న టీడీపీ బలం 7కు చేరుతుంది. దీంతో అధికార, విపక్షాలకు చిత్తూరు జిల్లాలో సరిసమాన సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నట్లవుతుంది.

  • Loading...

More Telugu News